'గ్రంథ చౌర్యం' గతి మారేదెప్పుడు ?



దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలో వచ్చిన 'దానిపేరే సారంగధరియ' అన్న ఒక జానపద గీతం విషయంలో వివాదం నడుస్తోంది. నిజానికి ఆ పాట ఆభానకం. కర్త ఎవరో తెలియదు. లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చిన ఆ పాటను తన సహజమైన గొంతుతో మంగ్లీ పాడింది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తాను సేకరించిన పాటను తన పాటగా ప్రచారం చేసుకొంటున్నాడని 'కోమలి' అనే జానపద గాయకురాలు ఆరోపణలు గుప్పించింది. ఈ మధ్యలో శిరీష అనే మరొక గాయని తానూ ఆ పాట ఆలపించినట్లు ప్రకటించడంతో వివాదం మరింత రేగింది. నిజానికి ఈ పాటను ఈ ముగ్గురిలో ఎవరూ రచించలేదు. 'సేకర్త' కోసం ఈ కొట్లాట!? సహజంగా సినీ పరిశ్రమ ధనం, పేరూ రెంటి చుట్టూ తిరుగుతోంది కాబట్టి ఈ చర్చంతా నడుస్తోంది. ఇలాంటి ఎన్ని ఆణిముత్యాలు అమ్ముకొని సినీ కవులు, పెద్దలు గొప్పవాళ్లయ్యారో లెక్క కూడా పెట్టలేం. కానీ పాటలకు ప్రాణం పోసిన జానపదులు ఎంత గొప్పవాల్లో ఈ వివాదం చూశాక అర్థం అవుతోంది. ఇదంతా గ్రంథచౌర్యమే. అడిగేవాడు లేడు కాబట్టి ఇది 'లిటరరీ ప్లాగరిజం' పరిధిలోకి రాకపోవచ్చు. నిజానికి జానపదులు అమాయకంగా పదాలు అల్లారు గాని తమ ముద్ర వేయలేదు. నిజానికి వాల్మీకి చెప్పిన రామకథను మార్చి ఎందరో కల్పితాలతో అనేక రామాయణాలు రాశారు. వేదవ్యాసుడు సంస్కృత భాగవతం రాయలేదని, టోపదేవుడు రాశాడని చెప్పేవాళ్లు ఎందరో ఉత్తర భారతంలో ఉన్నారు. పోతన మహాకవి 'భోగినీ దండకం' వంటి అశ్లీల రచన చేస్తాడా ? అని కొందరంటే భజగోవిందం ఆదిశంకరులది కాదని ఇంకొందరంటారు. కలం పేరుతో రాసే ఎందరో కవుల పైనా వివాదాలున్నాయి. భార్యలకు భర్తలే నవలలు, కథలూ రాసి ఇస్తారని కొందరు 'ఘోస్ట్ రైటర్స్' లిస్టే తయారుచేసి ప్రచారం చేశారు. కొందరు ధనవంతులు తమ పేర రచనలు చేయిస్తారని చెప్పేవారూ ఉన్నారు. భారతంలో వ్యాసుడు వాల్మీకి చెప్పిన ఏదైనా ధర్మసూత్రాలను చెప్పేటపుడు 'పురావాల్మీకి ప్రోక్తః' అంటాడు. కాళిదాసు మొదలుకొని చాలామంది కవులు పూర్వకవి స్తుతి చేసి తమ వినయాన్ని ప్రదర్శించేవారు, ఇంకొందరు కథాచౌర్యానికి పాపపరిహారం చేసుకొనేవారు. ఎందరో కవుల కావ్యాలపై వివాదాలున్నాయి. నన్నయ భారతాన్ని నారాయణభట్టు సరిచూసాడంటే ఆయన నన్నయకన్నా గొప్పవాడే కావచ్చు అని వాదించే వారూ ఉన్నారు. భారత రచనలో తనకు 'అభిమత స్థితి' తోడ్పడినందుకు నన్నయ నారాయణభట్టును కృతజ్ఞతగా భారతావతారికలో స్తుతించాడు. నన్నెచోడుడి తోక వెంటే మానవల్లి రామకృష్ణ కవి ఉంటాడు. ఆముక్తమాల్యద పెద్దనదా? రాయలదా? అన్న వివాదం వస్తే 'రాయలు రాశాడు. పెద్దన చూశాడు' అని పండిత పరిశోధకుడు వేదం వేంకటరాయశాస్త్రి తేల్చేశాడు. క్రీడాభిరామం శ్రీనాథుడిదా? వినుకొండ వల్లభరాయుడిదా? అంతెందుకు, బండి యాదగిరి రాసిన 'బండెనుక బండి గట్టి' పాటను అందరూ గద్దరే అనుకున్నారు. గూడ అంజయ్య పాటలు చాలా రోజులకు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఎన్నో సాహిత్య వివాదాలు ముసురుకొని.. ఉన్నాయి. ********************************* ✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి


ధనం, పదవి, భోగం, ఐశ్వర్యం అన్నీ పొందాక మనిషి ఏం చేయాలి? అన్న ప్రశ్నకు వాటిని కాపలాకాస్తూ జీవించడమే అన్న సమాధానం వస్తుంది. భిన్నమైన జీవనవిధానంలో కోరికలూ అనేకం. అవి నిరంతరం సంఘర్షిస్తూనే ఉంటాయి. వాటికి ఎక్కడా శాంతి లేదు. హద్దు అసలే లేదు. దీని వల్ల సంఘర్షణ మొదలవుతుంది. సాధనసమయంలో ఏకాంతంగా, మౌనంగా ఉండాలని మన పెద్దలు, శాస్త్రాలు చెప్పడంలోని అంతరార్థం ఇదే. ఎప్పుడైతే అంతర్ముఖులం అవుతామో సరస్సు అడుగు భాగంలో మెరిసే ఆల్చిప్పల్లా మన అంతరంగం అంతా మనకు కనిపిస్తుంది. మాలిన్యాలూ కన్పిస్తాయి. ఆ మాలిన్యాలే సంఘర్షణలు. వాటి నివారణకు భాగవత తత్వాన్ని అనుసరించాలి.

‘‘దారిద్య్రదుఃఖజ్వరదాహితానాం
మాయాపిశాచీపరిమర్దితానామ్‌
సంసారసింధౌ పరిపాతితానాం
క్షేమాయ వై భాగవతం ప్రగర్జతి’’

దారిద్య్రం, దుఃఖం, జ్వరం, మాయ, సంసారం - ఇలా అన్నింటినీ సులభంగా కడతేర్చే ఉపాయం భాగవతం అంటుంది శాస్త్రం. ఇక్కడ భాగవతం అంటే భగవత్తత్వం. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిని కలిగించేదని అర్థం. జగన్మంగళమైన భగవత్తత్వం తెలుసుకోవడమే యోగం. జగత్తంతా వ్యాపించిన పరమాత్మ.. ఉపాధితో కూడిన జీవుడిలోనూ ఉన్నాడు. సెల్‌ఫోన్‌తరంగాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. వాటిని పట్టుకోవాలంటే ఏదైనా సెల్‌, అందులో సిమ్‌కార్డ్‌, ఆ ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్న చార్జింగ్‌ అవసరం. అలాగే జీవుడి ఉనికిగా ఉన్న దేహం, శ్వాస, ఆత్మ ఈ మూడూ ఆ పరమాత్మతో అనుసంధానమైతేనే ‘యోగం’ జరుగుతుంది. కాబట్టి మొదట అంతటా వ్యాపించిన పరమాత్మను ఎలా పట్టుకోవాలో తెలిపే బ్రహ్మవిద్యను గుర్తెరగాలి. సర్వభూతాంతర్యామి అయిన పరమపురుషుని నిత్యత్వాన్ని ప్రాజ్ఞులైనవాళ్లు తలచుకొని మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానిస్తూనే ఉంటారు. ఆ సంప్రజ్ఞత మనలో ఉంటే చేసే ఏ కర్మ అయినా అది భగవద్దత్తమే. పూజలో, జపంలో, తపస్సులో, యజ్ఞంలో, పఠనంలో, శ్రవణంలో, యోగంలో అన్నింటిలో ఆ పరాతత్వ దర్శనం జరిగి తీరుతుంది. దానితో అనుసంధానం లేని ఎంత గొప్ప అనుష్ఠానమైనా వృధాప్రయాసే. ఎప్పుడైతే విరాట్పురుషుని విస్మృతి లేకుండా భజిస్తామో ‘వ్యాకులచిత్తం’ వ్యాసచిత్తంగా మారుతుంది.

మనస్సులోని సంఘర్షణలు మాయమైపోయేందుకు ఆధ్యాత్మిక దర్శనం జరగాలి. అదే బ్రహ్మవిద్య. ‘అహం బ్రహ్మాస్మి’ అని ధైర్యంగా ప్రకటించాయి ఉపనిషత్తులు. అది ఎవరూ మెరుగులు దిద్దలేని వేదాంత నినాదం. అవతలివైపు ఇంకేమీ లేదని చెప్పే మహత్తర సందేశం. అలాంటపుడు క్షుద్రమైనవేవీ మనసును తాకలేవు. ఎలాంటి ద్వంద్వ రూప భావాలను, లౌకిక విషయాలను కలిగించని మహోన్నతస్థితి... మనలోని రహస్యమైన అస్తిత్వాన్ని గొప్పగా విస్తరించుకునే దివ్యశక్తి... ఆధ్యాత్మికత. అది లభ్యమైన తక్షణం అన్నీ మటుమాయం.

*******************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*


శివరామదీక్షితుల అచల సిద్ధాంతాన్ని తేటతెలుగులోకి దింపిన మహనీయుడు కృష్ణప్రభువు. యక్షగానాలు, వీధి బాగోతాల్లోని కందార్థాలకు జీవం పోసి, వేదాంత విషయాలు చెప్పేందుకు అడుగువేయడం గొప్ప సాహసమే. వేదాంత, తాత్విక విషయాలు సంస్కృతంలో మాత్రమే చెప్పాలన్న నియమాల్ని తోసిపుచ్చి, వృత్తపద్యాల్లో, సంస్కృత శబ్దాలతో చెప్పినపుడు దానినే గొప్ప విషయంగా పరిశోధకులు చెప్తారు. అలాంటిది వీధి బాగోతాలలోని ఒకానొక కందార్థాన్ని ఉపయోగించి గహనమైన వేదాంత విషయాలు చెప్పడం కృష్ణప్రభువుకే చెల్లింది.

కం॥ శివరామదీక్షితుల శి
   ష్యవరుండప్పయ్య మంత్రి యతనిశిష్యడీ
   భువిపరశురామ వంశో
   ద్భవ సీతారాములతని భక్తూడసుమ్మీ!
   తద్బోధప్రయుక్తూడసుమ్మీ
   స్థవనీయులగు మీరు త్సాహాముతో
   యీగాథ వినుడీ ! నే కందార్థములచే
   వినిపింతు భక్తూడసుమ్మీ తద్బోధప్రయుక్తూడసుమ్మీ!॥
అంటూ.. తమ గురుపరంపరను స్మరిస్తూ, తాను తెలుగు సాహిత్యంలో కందార్థాలు అనే పేరుతో ఓ ప్రక్రియకు జీవంపోసి ఆధ్యాత్మిక భావజాలాన్ని కొత్తపం థాలో నడిపిన మహనీయుడు భాగవతుల కృష్ణప్రభువు. ఇతడు 1792 అక్టోబర్‌ 7న జానకమ్మ, నారాయణదాసు దంపతులకు నేటి యాదాద్రి క్షేత్రం పక్కనున్న కొలనుపాకలో జన్మించాడు. వీరిది హరికథల కుటుంబం కావడం వల్ల నారాయణదాసు సహజంగానే పండితుడయ్యాడు. ఈ దాసుగారి ప్రథమ సంతానం కృష్ణదాసు. కృష్ణదాసు మొదట భద్రాచల రామభక్తుడు. ఆ తర్వాత కాలంలో కుటుంబ సభ్యులు వరుసగా కాలధర్మం చెందగా, వైరాగ్యం పొంది ఏక్‌తార, చిటికెలు చేత బట్టి పాదయాత్రగా భద్రాచలం వెళ్లాడు. అక్కడ బుచ్చి వెంకమ్మ అనే భక్తురాలు ఆయనకు తారసపడి ‘నాయనా.. కాలవశంగా జరిగినదానికి చింతించడం నిజమై న వేదాంతి లక్షణం కాదు. పల్నాడులోని ఎర్రగొండపాలెంలో శివరామదీక్షితుల శిష్యడైన కంబలూరి అప్పబ్రహ్మం గారి శిష్యడు పరశురాముల సీతారామస్వామి ఉన్నారు. వారిని దర్శిస్తే నీకు కావలసిన ఆధ్యాత్మిక బోధ సంపూర్ణమవుతుంద’ని చెప్పింది.
శివరామదీక్షితులు (క్రీ.శ. 1690-1791) తెలుగునాట ‘అచల సిద్ధాంతా’నికి జీవం పోసిన గొప్ప గురువరేణ్యుడు. ఆయన నల్లగొండ జిల్లాలోని సంస్థాన నారాయణపురంలో జన్మించాడు. ‘శ్రీమద్బృహద్వాశిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామదీక్షితీయం’ అనే గ్రంథం రచించి, ఆధ్యాత్మిక లోకంలో గొప్ప సంచలనం కలిగించా డు. సంస్కరణ దృష్టితో నిజమైన ఆధ్యాత్మికవాదంగా ‘అచల సిద్ధాంతం’ పేరుతో లోకంలోకి తెచ్చినవాడు. ఆయన చేసిన ఈ పెనుమార్పు ఎర్రగొండపాలెంవరకు పాకింది. అక్కడి కంబలూరి అప్పయ్య మంత్రి, పరశురాముల సీతారాములను ప్రభావితం చేసింది. స్త్రీ, పురుష కులభేదం లేని ఆధ్యాత్మికమార్గం అచలం. అలాం టి అచలసిద్ధాంతం పరశురాముల సీతారాముల నుంచి స్వీకరించిన కృష్ణప్రభువు హైదరాబాద్‌కు వచ్చి, పెద్దమహరాజ్‌గంజ్‌ కేంద్రంగా తన ఆధ్యాత్మిక ప్రచారం మొదలుపెట్టాడు. కృష్ణప్రభువు ఆనాడు హైదరాబాద్‌లోని ఎందరో అధికారులను, గొప్పవ్యక్తులను తనవైపు ఆకర్షించాడు. కృష్ణదాసు ఆధ్యాత్మిక కీర్తనలను, శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధనిర్గుణతత్వకందార్థాలు, క్షరాక్షరోపాది ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు, సదృష్టాంత స్వప్రకాశిక, జాలమాంబకు ఉపదేశించిన ద్వాదశబోధలు అనే నాలుగుకృతులు ఇంకా ఎన్నో రచించాడు. అందులో ‘శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు’ ఓ కొత్త సాహిత్యప్రక్రియకు పునరుజ్జీవం కలిగించాడు. కృష్ణదాసు తర్వాత ఎందరో వీటిని అనుసరించారు. పెద్ద కందపద్యంలా ఉండే ఈ కందార్థం భజనలు, యక్షగానాలు, బయలాటలు, అన్ని కళారంగాల్లోకి ప్రవేశించింది. అయితే కృష్ణప్రభువు వల్ల ఇది ఆధ్యాత్మిక విషయ పరిపుష్టికి బాగా ఉపయోగపడింది. కృష్ణదాసు తర్వాత కృష్ణప్రభువుగా మారిపోయాడు.
292 కందార్థాలు రాసి, వారే స్వయంగా 110 కందార్థాలకు వ్యాఖ్యానం కూడా చేయడం విశేషం. 1865 నాటికే  ‘శుద్ధ నిర్గుణ కందార్థాలు’ రచన పూర్తి అయినట్లు తెలుస్తున్నది.

కం॥ పుట్టుట గిట్టుట లేకను
   పుట్టే గిట్టేటి యెరుక పోడి మెరుగకన్‌
   చట్టువలెకదల కుండును
   బట్టబయల్‌ యిట్టిదెరిగి  భావింపదగునూ
   యెరుక లేక సేవింప దగునూ
   వట్టియాశలచాత పట్టూబడకను
   యీ గుట్టూ దేశికునోటగట్టీగ దెలుసూక
   భావింప దగునూ యెరుకలేక సేవింపదగునూ॥
శిష్యా! జనన మరణములు లేనిది బయలు, జనన మరణములు గలది ఎఱుక. బయలు ఎరుకను ఎరుగక, (చట్టు) పర్వతంలాగా కదలక మెదలక ఉన్నది. ఈ కదిలే, మెదిలే ఎఱుకవల్ల పరిపూర్ణం ఎరిగి సేవించాలి. వృథా ఆశలను పొందకుం డా ఈ రహస్యం దేశికుని ద్వారా పొందాలి. ఇది అచలం మూల సిద్ధాంతంగా కృష్ణప్రభువు తేటతెలుగులో చెప్పిన వేదాంతం. సంస్కృత శ్లోకాలకు మాత్రమే పరిమితమైన మన ధర్మాన్ని సామాన్యులైన పామరులకు దరిచేర్చే భాషకు కృష్ణప్రభువు బాటలు వేశాడు. అచల మార్గంలో ఈ కందార్థ సాహిత్యానికి గొప్ప స్థానం ఉంది.
‘కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి’ అని శ్రీనాథుడే చెప్పాడు. అంతకుముందే అధర్వణవేదం (8-9-25) యక్ష శబ్దం పరమాత్మ వాచకంగా చెప్పింది. అలాగే యక్షులను బౌద్ధ సారస్వతం నీతిప్రవర్తకులుగా పేర్కొంది. వేదప్రమాణాలను తరచి చూస్తే ‘యక్షగానం’ ‘పరబ్రహ్మ కీర్తనం’గా భావించాల్సి వస్తుంది. యక్షగానం అంటే రాగ లయలతో కూడిన తాళాత్మకమైన దైవకీర్తనగా పరిశోధకుల అభిప్రాయం. యక్షులు అంటేనే కీర్తించేవారని అర్థం. ఇతిహాసాలు వారిని శైల జలవనదేవతలుగా పేర్కొన్నాయి. ఈ యక్షగానాలు తెలంగాణ ప్రాం తంలో కొత్తపుంతలు తొక్కాయి. మత, రాజకీయ పరిస్థితులను లక్ష్యపెట్టకుండా గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యాయి. క్రీ.శ.1326 తర్వాత వచ్చిన క్రీడాభిరామం వీధినాటకంగా నిలిచిపోయింది. దాన్ని వీధి భాగవతంగా ఇక్కడి కళాకారులు ఆడిపాడుకున్నారు. ఇలా ఏ రూపక ప్రదర్శన అయినా ‘బాగోతం ఆడటం’ అన్న పదబంధంగా మారిపోయింది. పాల్కురికి సోమనాథుడు, చరిగొండ ధర్మన్న వంటి తెలంగాణ కవులు తమ కావ్యాల్లో యక్షగానం గురించి పేర్కొన్నారు. మొత్తానికి తెలంగాణలో యక్షగానం ‘వీధి బాగోతం’గా రూపు సంతరించుకొన్నది. ఎందరో పరిశోధకుల ఆధారాలను బట్టి 1568 ప్రాంతానికి చెందిన కందుకూరి రుద్రకవి రచించిన ‘సుగ్రీవవిజయం’ మొట్టమొదటి యక్షగానంగా నిర్ధారింపబడింది. తెలంగాణలోని భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి, గ్రామీణ ప్రాంతాల ప్రజల కాలక్షేపానికి, పౌరాణిక విషయ పరిజ్ఞానానికి ‘వీధి బాగోతం’ ఒక సాధనమైంది. 
యక్షగానంలోని అనేక విషయాలు గానయోగ్యంగా మార్చుకొని ‘వీధిబాగోతం’ లోకి వచ్చాయి. అలాగే భద్రాచల రామదాసు (1620-1684) వంటి వాగ్గేయకారుడు యక్షగానాల బాణీల్లోనే అనేక కీర్తనలు రచించాడు. అలా ఎందరో ఈ యక్షగానంలోని ప్రజారంజక విషయాలను కొత్తమార్గాలలో నడిపించారు. ఈ క్రమంలో యక్షగానాల్లోని కందార్థ దర్వులను భాగవతుల కృష్ణప్రభువు స్వీకరించి, అచల సిద్ధాంతం మొత్తం 292 కందార్థాలుగా రచించి కొత్త బాట వేశాడు.
శివరామదీక్షితుల అచల సిద్ధాంతాన్ని తేటతెలుగులోకి దింపిన మహనీయుడు కృష్ణప్రభువు. యక్షగానాలు, వీధి బాగోతాల్లోని కందార్థాలకు జీవం పోసి, వేదాంత విషయాలు చెప్పేందుకు అడుగువేయడం గొప్ప సాహసమే. వేదాంత, తాత్విక విషయాలు సంస్కృతంలో మాత్రమే చెప్పాలన్న నియమాల్ని తోసిపుచ్చి, వృత్తపద్యాల్లో, సంస్కృత శబ్దాలతో చెప్పినపుడు దానినే గొప్ప విషయంగా పరిశోధకులు చెప్తారు. అలాంటిది వీధి బాగోతాలలోని ఒకానొక కందార్థాన్ని ఉపయోగించి గహనమైన వేదాంత విషయాలు చెప్పడం కృష్ణప్రభువుకే చెల్లింది. బహుశా ప్రజలభాష ను రక్షించే క్రమంలో, గ్రామీణులకు అర్థమయ్యే మాధ్యమంగా ఆయన దాన్ని ఎంచుకొని ఉండవచ్చు.
కృష్ణప్రభువు ఇంటిపేరు భాగవతులవారు కావడంవల్ల కచ్చితంగా వారి పూర్వీకులు భాగవతాలు నేర్పించే గురువులుగానో, భాగవత ప్రవచనం చేసే పండితులుగానో ఉండిఉంటారు. వారి చరిత్రనుబట్టి వారు హరికథలు చెప్పేవారని తెలుస్తుం ది. హరికథ కూడా సంస్కృత శ్లోకాలు, కీర్తనలు, గీతాలతో నడుస్తుంది. కానీ కృష్ణప్రభువులు యక్షగానాలు, వీధిబాగోతాల కందార్థదర్వులతో వేదాంతం చెప్పడం జనం భాషలో విషయాన్ని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకే. అచలమార్గంలో వచ్చిన ఈ కందార్థాల భావాన్ని అర్థం చేసుకుని ఎందరో పదకవులు పుట్టుకొచ్చారు. వారు అచలాన్ని తమ తత్వాలనిండా నింపి సంకీర్తన సాహిత్యాన్ని కూడా పరిపుష్టి చేశా రు. ఇప్పటికీ భజన పాటల మధ్యలో విరామంగా భాగవతుల కృష్ణదాసు విరచిత కందార్థాలు చదవడం ఒక సంప్రదాయంగా మారింది.
‘కందం రాసిన వాడే కవి; పందిని కొట్టినవాడే బంటు’ అన్నది తెలుగుసామెత. అన్ని పద్యాల్లో చిన్నగా కన్పించేది కందపద్యం. కానీ నియమాలు ఎక్కువ. అలాగే అడవిపంది క్రూరజంతువు కాకున్నా వేటగాళ్లకు దానిని చంపడం ఓ సాహసం. కందం రాయడం కూడా సాహసమే మరి! అలాంటి కందం గానయోగ్యంగా కూడా ఉంటుంది. 
బద్దెన రచించిన ‘సుమతీ శతకం’ ఎంత ప్రాచుర్యం పొందిందో మనకు తెలుసు. సంస్కృతంలోని ‘ఆర్యేతివృత్తం’ కందంగా తెలుగులోకి వచ్చిందని చెప్తారు. అయి నా మనం కందాన్ని వృత్తఛందస్సులో చేర్చకుండా, దేశీ ఛందస్సులో భాగంగానే పరిగణిస్తున్నాం. ఈ కందపద్యం యక్షగానాల్లో సమున్నత గౌరవం పొందింది. గానయోగ్యమైన కందాన్ని ఈ యక్షగానకర్తలు ప్రార్థన నుంచి మంగళాంతం వరకు ఎక్కడంటే అక్కడ ప్రయోగించారు. 
రెండవ, నాలుగవ పాదంలోని గణంలోని చివరున్న గురువు రాగాలాపనకు పనికివస్తుంది. ఈ కందానికి రాగ లయ తాళాలున్న దర్వు కలుస్తుంది. అందువల్ల దానికి మరింత ఊపువచ్చి, పాడుకునేందుకు మరిం త బాగా ఉపయోగపడుతుంది. కందంలోని ద్వితీయార్థమైన నాల్గవ పాదంలోని యతి స్థానం దగ్గర నుంచి మూడు లేదా నాలుగు పాదాల రాగమాలిక కందాన్ని అనుసరిస్తుంది. ఈ కందం, దర్వు రెండూ కలిసి కందార్థంగా మారిపోయింది. యతి స్థానం దగ్గరనుంచి మొదలైన దర్వు, కందంలోని కొంచెం భాగాన్ని ఒక పాదంగా, తర్వాత రెండు పాదాలను పరిశీలిస్తే.. 18 నుంచి 24 మాత్రల ప్రయో గం జరిగిందనిపిస్తుంది. దర్వులను జనరంజకత్వం కోసం కృష్ణ ప్రభువు కూడా కుదింపు, పొడిగింపు చేశారు. అయితే ఇదంతా కృష్ణదాసు కవిత్వంలో అంత నియతంగా లేదు. ఆయన విషయానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. దర్వు ప్రారంభమైన మొదటి పాదంలో 22 మాత్రలు, రెండో పాదంలో 20 మాత్రలు, మూడో భాగంలో 18 మాత్రలు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి. కొన్ని కందార్థాల్లో దర్వులు ఎక్కువ మాత్రలతో, మరికొన్ని తక్కువ మాత్రలలో ఉన్నాయి. బహుశా! వారు విషయాన్ని బట్టి నిడివిని పెంచుకున్నట్లు, తగ్గించినట్లు అనిపిస్తున్నది.
కృష్ణదాసుగారు స్వేచ్ఛగా కొన్నిపదాలను ప్రయోగించారు. అలాగే కొన్నిచోట్ల గణాలు కూడా కుదరడంలేదు. యతిప్రాసలు అక్కడక్కడ గతితప్పాయి. కృష్ణదాసు తర్వాత అనేకమంది దీన్ని ఎత్తిరాసుకున్న వారు, పరిశోధన జ్ఞానంలేనివారు ‘ఉచ్చారణ దోషాలను’ అలాగే కొనసాగించారు. అంతేగాక ఈ స్వల్ప దోషాలున్న కందార్థాలే లక్షలాది మందికి కంఠపాఠంగా ఉన్నాయి. అందువల్ల వీటిని సవరించేందుకు ఎవరూ సాహసం చేయలేదు. కందపద్యం పైన ఏర్పడిన దర్వును తాను చెప్పే వేదాంతానికి మాధ్యమంగా కృష్ణప్రభువు భావించాడు.
సంగీతశాస్త్రంలో దర్వుకు ఇంకొక రకమైన ఉపయోగం ఉంది. శృంగార రసం సంగీతంలో ప్రధానంగా చేసుకొని రాసేది దర్వు. దర్వులో పల్లవి, అనుపల్లవి, చరణాలు అనేవి త్రిధావిభక్తమై ఉంటాయి. దర్వు తక్కువ చరణాలతో ఒకే ధాతుశైలి లో ఉంటుంది. తిల్లాన దర్వు, ప్రవేశ దర్వు, సంవాద దర్వు, స్వగత దర్వు, జక్కిణ దర్వు అని ఐదు విధాలుగా ఉంటుందని సంగీతవేత్తలు చెబుతారు. ఈ దర్వులు రాసిన ప్రముఖ పదకర్తల్లో ముత్తుస్వామి దీక్షితులు, త్యాగయ్య, సుబ్బరాయ దీక్షితులు వంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ ఐదింటిలో సంవాద దర్వులను యక్షగానాలు, వీధిబాగోతకర్తలు స్వీకరించగా, భాగవతుల కృష్ణ ప్రభువు స్వగత దర్వుగా స్వీకరించాడని చెప్పవచ్చు. ఈ కందార్థాలే కాకుండా సీసార్థాలు, గీతార్థా లు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉత్పల మాలార్థం కూడా ఉండటం విశేషం.
కందపద్యం పరిమాణంలో చిన్నది అవడంవల్ల విషయపుష్టికి అవకాశం తక్కు వ. కాబట్టి కందార్థాల్లో ఎక్కువ విషయాన్ని చెప్పాలనుకోవడం సహజమే. అధిక మాత్రలవల్ల పాడుకొనేందుకు ఊపువస్తుంది. కందార్థాల్లో చాలాచోట్ల హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులుగా, దీర్ఘాచ్చులు హ్రస్వాలుగా మారిన సందర్భం కనిపిస్తుం ది.ఈ సాగదీయడం, విరవడం అనేది లయ కోసం మాత్రమే. అలాగే అశ్లీలాలు ధ్వనించకుండా జాగ్రత్త వహించేందుకూ ఈ విరుపులు పనికి వచ్చాయి. శబ్ద పరిజ్ఞానం లేనివాళ్లలో ఈ విరుపులు విపరీతార్థాలకు కూడా దారితీస్తాయి.
తెలుగు ప్రాంతంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత స్థానం కృష్ణప్రభువు రచించిన కందార్థాలదే. అచల మతబోధకుల్లో ఈ కందార్థాల పాదు ఎంతగట్టిగా నిలబడిందంటే, అచలం గురించి ఏది చెప్పాలన్నా, ఈ కందార్థంలోనే చెప్పాలన్నంతగా రూఢైపోయింది. అలాంటి కందార్థసాహిత్యానికి బీజావాపనం చేసిన ఆధ్యాత్మికవేత్త కృష్ణదాసు. అచ్చతెలుగు భాషకు, తెలంగాణ పలుకుబడులకు, నుడికారాలకు పట్టంగట్టాడు.

తల్లావఝ్జుల జాలమాంబ వంటి స్త్రీమూర్తిని శిష్యురాలిగా చేసుకొన్నాడు. అంతేగాక ఆమెను తత్వాలు, మంగళారతులు రచించే విధంగా తీర్చిదిద్దాడు. ‘గురునకు మంగళమనరమ్మా’ అన్న ప్రసిద్ధ మంగళారతిపాట జాలమాంబదే. అలాగే నాడు నిజాం ప్రభుత్వంలో ఉన్నతపదవుల్లో ఉన్న పీల్ఖానా లక్ష్మణదేశికులు, పీల్ఖాన శంకరప్రభువులకు ఉపదేశమిచ్చి వారిని గొప్ప గురువులుగా తీర్చిదిద్దాడు. అచల సిద్ధాంతాన్ని కృష్ణప్రభువు మార్గంలో సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత, భారలింగప్రభువు, వెలివర్తి రామదాసు, శేషమాంబ వంటి గురువులెందరో తమ యోగదానం చేశారు.

నిరక్షరాస్యులైన వారిలో వేదాంతజ్ఞానం కలిగించిన అచలగురువులకు, తత్వకవులకు భాగవతుల కృష్ణప్రభువు దిక్సూచిగా నిలిచాడు. శివరామదీక్షితుల సిద్ధాంతాలను అందించడంలో కృష్ణప్రభువు అతని శిష్యపరంపర సఫలీకృతం అయ్యిం ది. తెలుగు ప్రాంతంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత స్థానం కృష్ణప్రభువు రచించిన కందార్థాలదే. అచల మతబోధకుల్లో ఈ కందార్థాల పాదు ఎంతగట్టిగా నిలబడిందంటే, అచలం గురించి ఏది చెప్పాలన్నా, ఈ కందార్థంలోనే చెప్పాలన్నంతగా రూఢైపోయింది. అలాంటి కందార్థసాహిత్యానికి బీజావాపనం చేసిన ఆధ్యాత్మికవేత్త కృష్ణదాసు. అచ్చతెలుగు భాషకు, తెలంగాణ పలుకుబడులకు, నుడికారాలకు పట్టంగట్టాడు. కృష్ణప్రభువు 1876లో దేహత్యాగం చేశాడు. వారి భౌతికశరీరాన్ని బేగంపేటలో సమాధి చేశారు. విమానాశ్రయ నిర్మాణంలో కృష్ణప్రభువు సమాధి చెదిరిపోయింది. శివరామదీక్షితుల అచలసిద్ధాంత రహస్యాలను తెలంగా ణ ప్రాంతంలో మాట్లాడే భాషా సుగంధాన్ని అద్ది, తెలుగు సాహితీ దర్బారులో ‘కందార్థాలకు’ పట్టాభిషేకం చేసిన వాడు కృష్ణప్రభువు.
**********************************
డాక్టర్. పి. భాస్కర యోగి

 
నమస్తే తెలంగాణ : సోమవారం







సంగీత ప్రపంచంలో భారతరత్న పొందిన గొప్ప షెహనాయి విద్వాంసులు ఉస్తాద్ ఖమ్రుద్దీన్ బిస్లిల్లాఖాన్ గురించి ఓ సంఘటన జనబాహుళ్యంలో ఉంది. ఆయన హిందూ పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఉండేవారు. ఆయనను కలిసినవాళ్లు ‘‘మీరు ఇంకా గొప్పవారు కావాలంటే ఢిల్లీలో ఉంటే బాగుంటుంది కదా!’’ అంటే ఆయన తడుముకోకుండా ‘‘్ఢల్లీలో విశే్వశ్వరుడు, గంగానది లేవు కదా!’’ అని ఎదురు ప్రశ్నించేవాడట.

 ఆయన ‘షెహనాయి’ సంగీతం అభివృద్ధికోసం తన జీవిత కాలంలో చాలా భాగం బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతికాడు. అతనికి కాశీ విశే్వశ్వరుడి పట్ల, గంగానది పట్ల అంత ప్రేమ ఎందుకున్నాయో ఈరోజు సూడో సెక్యులర్, లిబరల్ మేధావులు ఆలోచించాలి. 

అలాగే ఇటీవల కేరళ గవర్నర్‌గా నియమింపబడిన మాజీ మంత్రి ఆరీఫ్ మహ్మద్‌ఖాన్ ప్రతిపాదిస్తున్న జాతీయవాద భావనను ఇపుడున్న పరిస్థితుల్లో ఈ దేశ ముస్లింలు అర్థం చేసుకోవాలి. 1986 రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఉండి షాహబానో కేసు తర్వాత త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా అనర్గళ ప్రసంగం పార్లమెంటులో చేసారు. తదనంతర కాలంలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బెదిరింపులకు లొంగిన రాజీవ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విభేదించి, ముస్లిం మహిళల హక్కులవైపు నిలబడి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ధీశాలి.

 ఆయన రచించిన ‘టెక్స్ట్‌అండ్ కంటెక్స్ట్’ అన్న పుస్తకం ప్రతి ముస్లిం చదివి తీరాలి. ఇటీవల ఆయన ప్రసంగాల్లో సర్ సయ్యద్, వౌలానా అబుల్‌కలాం ఆజాద్ వంటి వారిని బాగా ఎక్స్‌పోజ్ చేసారు. వేద, ఉపనిషత్తుల్లోని మంత్రాలను, శ్లోకాలను దివ్య ఖురాన్‌కు అనుసంధానం చేసి గొప్పగా చెబుతున్నారు. ఇదే పని వివాదాస్పద మతగురువు డా. జకీర్‌నాయక్ చేసాడు. 

వేదోపనిషత్తుల్లోని నిర్గుణ తత్వాన్ని ఉపయోగించుకొని దీని అంతిమ నిర్ణేత ఇస్లాం అంటూ ప్రచారం చేసాడు. అతని ప్రచారం బెడిసికొట్టి మత ప్రచారం తీవ్రవాదానికి కారణం అయ్యింది. ఇపుడు డా. జకీర్ నాయక్ ఇతర దేశాల్లో నేరస్థుడిగా మారి మలేషియా, సౌదీల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అదే ఆరీఫ్ మహమ్మద్‌ఖాన్ ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లాడు. పదవి రాగానే అతని స్పందన ‘‘కేరళ దేవభూమి, నేను యుపీలో పుట్టినా భారతదేశం చివర అంచుకువెళ్లి సేవచేసే భాగ్యం నాకు లభించింది’. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఇక్కడ ముస్లింలు అనుభవిస్తున్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా దొరకదు’’ అన్నాడు. 

ఇది అక్షర సత్యం. ఇక్కడ సూడో సెక్యులరిస్టులు ఆరోపిస్తున్నట్లు హిందూ సంస్థలవల్ల ముస్లింలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నది దుష్ప్రచారం తప్ప ఇంకేం కాదు. మరి ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ లేని సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఆప్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఇండోనేషియా, చెచెన్యా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, స్పెయిన్, సైప్రస్, రష్యా, యుకె. మొదలైన దేశాల్లోకూడా నిత్యం బాంబుల మోతలు ఎక్కడివి? అక్కడ రోజూ ఏదో ఒకచోట ప్రాణనష్టం జరుగుతూనే ఉంది కదా? అక్కడ కూడా హిందూ సంస్థలే దాడి చేస్తున్నాయా?


దీనికి కారణాలు ఏనాడో భారతీయ సమాజం గుర్తించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్లామిక్ స్టేట్’ పేరుతో ఐసిస్ ఉగ్రవాదం తీవ్రతను ఇపుడు అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి. జీహాద్ పేరుతో జరుగుతున్న ఈ దుశ్చర్యలపై ఏ వౌల్వీని అడిగినా ‘‘అది అసలు ఇస్లాం సంస్కృతే కాదు’’ అంటూ విచిత్రమైన సమాధానం చెప్తారు. మరి ఏది అసలు సిసలైన ఇస్లాం? అంటే ఎవరూ సమాధానం చెప్పరు. 

ఇక సెక్యులర్ ముసుగేసుకున్న హిందూ వ్యతిరేకత జీర్ణించుకొన్న ఎర్ర మేధావులను అడిగితే సౌదీలోని ఆయిల్ దొంగిలించేందుకు ‘‘ఇది అమెరికా అంకుల్ శ్యామ్‌గాడు పన్నిన పన్నాగం’’ అంటారు. అలాగే భారత్‌లో తీవ్రవాదానికి ఆరెస్సెస్ కారణం అంటూ కుతర్కం చేస్తారు. ఒక వ్యక్తి సెక్యులర్ అయినా కావాలి లేదా ముస్లిం అయినా కావాలి లేదా నాస్తికత్వం అంటూ మతం మత్తుమందు అనే మార్క్సిస్ట్ అయినా కావాలి. ఈ దేశంలో ఈ కలగాపులగం ఏంటో ఎవరూ నిర్వచించరు!?

నిజానికి ‘సెక్యులరిజం’ అన్నది మన రాజ్యాంగంలో మొదట చేర్చలేదు. భారత్‌లో సంతుష్టీకరణ రుచిమరిగిన తర్వాత విదేశాలనుండి తెచ్చుకున్న అరువు పదం. నిజానికి అన్ని స్వీకరించే గుణం ఋగ్వేదం ‘ఏకం సద్విప్రాబహుధావదన్తి’ అంటూ నిర్వచించింది. అందుకే ఓ మేధావి చెప్పినట్లు ‘‘ప్రపంచం మొత్తం నశించినా భారత్ ఒక్కటుంటే చాలు. ఎందుకంటే ప్రపంచంలోని వైవిధ్యాలన్నీ భారత్‌లో కన్పిస్తాయి. ఇక్కడ ఆదిశంకరుడు, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు, జీసస్, మన్సూర్.. అందరూ ఏకకాలంలో ఆరాధింపబడతారు’’ అంటాడు. నిజమే! దానికి మూలం హిందువుల్లోని సహిష్ణుత మాత్రమే కాదు.

 స్వీకరించే గుణం. ఈ స్వీకరించే గుణం ఉన్నందునే క్రీ.శ. 629లోనే కొచ్చిన్ దగ్గర హిందూరాజులు మసీదు నిర్మించి ఇచ్చారు. మహమ్మద్ ప్రవక్త దేహ త్యాగం చేసాక 18గం.ల వరకు ఖననం జరుగకుండానే మొదలైన హత్యాకాండ ఆయన కుటుంబ సభ్యులనూ వదిలిపెట్టలేదు. వారికి ఆశ్రయం ఇచ్చిన సింధురాజు దాహిర్‌సేన్ మహమ్మద్ బిన్ కాశీం చేతిలో మరణించాడు. అలాంటి మహమ్మద్ బిన్ కాశీం గొప్పవాడంటూ సయ్యద్ వౌలానా వౌదూదీ అసనలీబన్నా, సయ్యద్ కుతుబ్ వంటివారు ‘‘ఇస్లామిక్ బ్రదర్‌హుడ్’’ పేరుతో పుస్తకాలు రాసి ఢిల్లీలో పంచుతున్నారు?! ఎంత విచిత్రం! ప్రపంచంలోని ఎడారి ప్రాంతాల్లోని సౌదీ చుట్టుప్రక్కల గల 16 దేశాలు చిన్నవికాబట్టి వాళ్లు ‘మతపరమైన బ్రదర్‌హుడ్’ రాజకీయ అవసరాల సౌకర్యంకోసం పెట్టుకొన్నది.

 ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాల్లోని ఒక్కో దేశంతో సమానమైన ముస్లిం జనాభా మన దేశంలో ఉంది. ఇస్లాం అరబైజేషన్ అయ్యాక ‘వహాబిజం’ పెరుగుతూ మన దేశంలో అసలు సిసలైన ‘్భరతీయ ఇస్లాం’ను ప్రభావితం చేస్తున్నది. దానివల్లనే ఇక్కడ ప్రసిద్ధమైన ఖవ్వాలీ సంగీతం, సూఫీల తాత్వికత, మన్సూర్, బులెషా, బందెనవాజ్, గరీబన్నవాజ్, హజ్రత్ నిజాముద్దీన్ వంటి వాళ్ల స్మృతులు ఇపుడు చెరిపేస్తున్నారు. గాలిబ్, ఫిరార్ వంటి కవులను మాయం చేస్తున్నారు. బాద్షాఖాన్, వౌలానా అబుల్‌కలాం, ఏపీజే అబ్దుల్‌కలాం వంటి నేతలను మతం మత్తులో ప్రక్కకు తప్పిస్తున్నారు. 

ఇదంతా హిందూ సంస్థలు చేయడంలేదు. ఇదంతా హిందుస్థాన్‌లో పుట్టిన, పెరిగిన ఇస్లాం రూపం. అజ్మీర్‌కు చెందిన ఇస్లాం గురువు ఖ్వాజా గరీబన్నవాజ్ కదలకుండా ప్రపంచంలోని 90 లక్షల మంది చేత ‘కల్మా’ చదివే విధంగా ఇస్లాం వ్యాప్తిచేసాడు. గతంలో వాజ్‌పేయ్‌తో చర్చలు జరిపేందుకు భారత్‌కు వచ్చిన పర్వేజ్‌ముషర్రాఫ్ మొదట అజ్మీర్‌ను సందర్శించాలని, తర్వాత ఎందుకు వెనక్కితగ్గాడో ఎవరికైనా తెలుసా? ఈ చరిత్రపై అవగాహనాశూన్యులైన ఈ దేశ లెఫ్ట్ లిబరల్స్ హిందూ వ్యతిరేకతను సెక్యులరిజంగా, ‘ఇస్లామిక్ సుపీరియారిటీ’ని మైనార్టీ హక్కుల రక్షణగా భావిస్తున్నారు. 

హిందూ తత్వగ్రంథాలను అనువాదం చేసిన దారాషికోను మరుగున దాచిపెట్టి, తండ్రిని జైల్లో బంధించి, సోదరులను చంపి, చెల్లెల్ని ఎర్రకోటపైనుండి క్రిందకు తోసి చంపిన ఔరంగజేబును హీరోగా భావిస్తున్నారు. ద్విజాతి సిద్ధాంతంతో భారత్‌ను మతప్రాతిపదికన రెండుగా చీల్చిన పాకిస్తాన్ ఖాయిదే ఆజం మహమ్మదాలీ జిన్నాకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. నిజానికి జిన్నా హజ్ యాత్ర లేదు. పంది మాంసం తిన్నాడు. స్నేహితుడి కూతురిని లేపుకుపోయాడు. ఇదంతా ఇస్లాంకు విరుద్ధం, అయినా అతడిని హీరోను చేసారు. విభజనవల్ల 10 లక్షల మంది మరణించారు. హిందువులకు జీవనాడి లాంటి సింధు నాగరికతను కోల్పోయాం. లవుడి పేరుతో ఏర్పడ్డ ‘లాహోర్’ కోల్పోయాం. 

మన ప్రాచీన నాగరికత అంతా రావి, సట్లేజ్, సింధు నాగరికతల చుట్టూ తిరిగింది కదా! జిన్నాకు ఏ సంబంధం లేని సింధు ప్రాంతాన్ని నిర్ధాక్షిణ్యంగా ఇచ్చేస్తే అక్కడి ప్రజలు తాము ఏం తప్పుచేసామో తెలియకుండా తమ ప్రాంతాన్ని వదిలేసారు. ఆర్య- ద్రావిడ సిద్ధాంతం బలపరిచే ప్రబుద్ధులు తమిళుల ద్రావిడ భాషల సరసన ఉండే ‘బ్రాహోరుూ’ భాష బలూచిస్తాన్ వాళ్లదని ఎప్పుడైనా ఆలోచించారా? ఏనాడైనా పాకిస్తాన్ మత కోరల్లో నలిగిపోతున్న బలూచీల ఆవేదన గురించి పాలస్తీనాపై కురిపించే ప్రేమలో పదోవంతు అయినా తమ పుస్తకాల్లో చెప్పారా? అక్కడున్న ‘నానీమందిర్’ను రక్షించడంలో వాళ్లు కోల్పోయిన ప్రాణాల సంఖ్య ఎంతో కాశ్మీరియత్ గురించి మాట్లాడేవాళ్లు చెప్పగలరా? కాబూల్‌లో తన వీరప్రతాపం చూపించిన రాజారంజిత్‌సింగ్ గురించి ఎప్పుడైనా గర్వంగా చెప్పుకొన్నామా? సిక్కుల ఆనవాళ్లు నిర్ధాక్షిణ్యంగా పాకిస్తాన్‌లో ధ్వంసం అవుతుంటే ఎప్పుడైనా కన్నీరు కార్చామా? హిందీ భాష దక్షిణాదిపై రుద్దుతున్నారని గోలపెట్టే మేధోవర్గం పాక్‌లోని పంజాబ్‌లో ఒక్క పంజాబీ పాఠశాల ఎందుకు లేదని అంతర్జాతీయ జర్నల్స్‌లో వ్యాసం రాసారా?
ఈ దేశంలో హిందుత్వం నశించాక మిగిలేది బూడిదే. భారత్‌లోని ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైద్రాబాద్ వంటి నగరాల్లో ముస్లిం జనాభా 20 శాతం దాటింది. మరి కరాచీ, రావల్పిండి, లాహోర్, పెషావర్‌లలో స్వాతంత్య్రం కన్నాముందు తర్వాత, ఇప్పుడు హిందూ జనాభా ఎంత? కాశ్మీరీయత్ గురించి గగ్గోలుపెట్టేవారు ఈ డెబ్బై ఏళ్లలో జమ్మూకశ్మీర్‌లో ఒక్క హిందూ సీఎం కాలేదో చెప్పగలమా? తన కొడుకుకు సద్దాం హుస్సేన్ అని పేరుపెట్టుకొన్న గులాం నబీ ఆజాద్ అదే ఇరాక్ ప్రక్కనున్న బమియాన్ బుద్ధవిగ్రహాలు తాలిబన్ల చేతిలో ధ్వంసం అవుతుంటే విచారం వ్యక్తం చేసాడా?
సింధు నాగరికతను పరాయివాడి చేతిలోపెట్టి గంగా యమునా తహెజీబ్ అంటున్న ‘మూర్కిస్టుల’కు ఇవన్నీ ఎప్పుడు కన్పిస్తాయి? ఇపుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మత తీవ్రవాదం మూలం తెలియకుండా ఇక్కడ చిల్లరమల్లర రాజకీయాల్లో పడి చేస్తున్న వాదన పేరుతో సాగుతున్న మత రాజకీయవ్యాప్తి ఇపుడు ప్రపంచ తీవ్రవాదంగా మారుతున్నవేళ ఇక్కడి ‘బహుళత్వం’లోని ఏకత్వాన్ని గ్రహించకుండా లిబరల్ శక్తులు వేస్తున్న అడుగులు భారత్‌కు ప్రమాదం అని తెలుసుకొంటే మంచిది. 

బుజ్జగింపు, సంతుష్టీకరణ ధోరణులతో ఒక మతంవాళ్లను ప్రత్యేకం అనే ధోరణి పెంచడంవల్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమ ఉనికిని రోజురోజుకు కోల్పోతున్నారు. సంతుష్టీకరణ ఓ సిద్ధాంతంగా మార్చిచేస్తున్న విన్యాసాలు మోదీ, షాలను మరింత గొప్ప హీరోలుగా మారుస్తున్నాయన్న స్పృహకూడా వీళ్లకు లేదు. ‘్భరతీయులంతా సమానం’ అన్న ధోరణి ఇక్కడున్న అన్ని మతాల వాళ్లలో కలగాలి. ముఖ్యంగా ‘మేం ప్రత్యేకం’ అన్న భావన ముస్లిం సమాజం వదిలిపెట్టాలి. వెయ్యేళ్లు బానిసత్వం అనుభవించిన హిందువుల్లోని గూడుకట్టుకొన్న ఆక్రోశాన్ని వారి మనోభావాలను గౌరవించి తగ్గించాలి. ప్రాచీనమైన యోగా సంప్రదాయం గౌరవించాలి. ఎక్కడో పుట్టి, మరెక్కడో మరణించిన బాబ్రీ మనస్తత్వాన్ని వదిలేసి హిందువులను ఖుషీచేయాలి. సాక్షాత్తూ మహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసిన ‘బిలాల్ మసీదు’నే అక్కడ వసతులకోసం కూలగొట్టారు. బాబర్ లాంటి దురాక్రమణదారు పేరుమీద మసీదు పంచాయతీ చేయడం హిందువులను మరింత రెచ్చగొడుతుంది. 

విగ్రహారాధకులను కాఫిర్లుగా భావించి ద్వేషించడం సరైంది కాదు. బాబర్, లోడి, ఔరంగజేబు, ఘజనీ, నాదిర్షా, తైమూర్లండ్, కాశీం లాంటివారే కొన్నాళ్లు పాలించి, కొందరిని చంపారు అంతే! ఇక్కడున్న బహుళత్వాన్ని చంపితే ప్రపంచానే్న చంపేసినట్లు!! మహమ్మద్ ప్రవక్త ఓ హదీస్‌లో చెప్పినట్లు ‘‘మై హిందు సేన హీహూఁమగర్ హింద్ మజ్‌మేహై’ అన్న వాక్యాల వెలుగులో ఈ దేశాన్ని అధ్యయనం చేయాలి. అపుడు హిందూ, ముస్లింలది ఒకే భవిష్యత్తు అయి తీరుతుంది.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *



ఢిల్లీలో ‘ఆప్’ గెలవగానే సంబంధం లేనివాళ్లు సంబరాలు చేసుకొంటున్నారు. ‘తుపాకులు పేల్చిన వారికి చీపురుతో బదులిచ్చారు’ అంటూ ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేయడమే దీనికి ఉదాహరణ. ఇక సీతారాం ఏచూరి మొదలుకొని ప్రచ్ఛన్న కమ్యూనిస్టు మేధావులంతా అక్షరాలతో భాజపాపై తమ అక్కసంతా వెళ్లగక్కారు. ‘విద్వేష రాజకీయాలకు, విభజన రాజకీయాలకు చెక్’ అంటూ ఏచూరి, చిదంబరం సంబరపడిపోతున్నారు.

 మమతా బెనర్జీ అయితే ఏకంగా ‘సీఏఏ - ఎన్నార్సీకి వ్యతిరేక తీర్పు’ అంటూ తీర్పు చెప్పేసింది. ‘సీఏఏ ఉచ్చులో కేజ్రీవాల్ పడలేదు’ అంటూనే మరోవైపు ఇది సీఏఏ విజయం అని చెప్పడం మూర్ఖత్వం తప్ప ఇంకేం కాదు. ఇక భాజపా వ్యతిరేక నెటిజన్లు ‘షాను - మోదీని’ అనేక రకాలుగా అవమానిస్తూ వాళ్ల పనై పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. 

అనేక ‘సందర్భాల్లో’ వ్యాసాలు రాసే సూడో సెక్యులర్ మేధావులు ‘్భరత్‌కు ఇపుడు కేజ్రీవాల్ లేదా ప్రాంతీయ పార్టీలే దిక్కు’ తమ అక్షరోన్మాదం ప్రకటిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే 150 ఏళ్ల చరిత్రకు దగ్గరున్న కాంగ్రెస్ ‘తమకు సున్నా వచ్చినా సరే భాజపా ఓడిందని’ సంబరాలు చేసుకొంటున్నారు. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ వాళ్లకు ఢిల్లీలో ఒరిగిందేమీ లేకున్నా మిఠాయిలు పంచుకుంటుంటే మనం ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. 

పూర్వం ఒక తపస్సు చేస్తున్న వాడికి దేవుడు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అంటే అవతలి గట్టుపై తపస్సు చేస్తున్న వాడికి నాకన్నా రెట్టింపు ఇవ్వండి’ అన్నాట్ట. మరి నీకేం కావాలి అంటే ‘నాది ఒక కన్ను తీసేయ్’ అన్నాడట. సరిగ్గా కాంగ్రెస్, కమ్యూనిస్టుల పరిస్థితి ఇలా ఉంది. ఆఖరుకు కాంగ్రెస్‌లో పేరు మోసిన ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ‘కాంగ్రెస్ దుకాణం మూసేసి, బీజేపీని ఓడించే పని ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేద్దామా! ప్రాంతీయ పార్టీలకు దేశాన్ని అప్పగిద్దామా?’ అంటూ నేరుగా ప్రచ్ఛన్న కమ్యూనిస్టు కాంగ్రెస్ నేత పి. చిదంబరాన్ని కడిగి పారేసింది.

నిజానికి 2015 ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్లు ఉంటే 67 ఆప్ గెలుచుకోగా 3 భాజపా గెలిచింది. 2020లో 62 ఆప్ గెలుచుకోగా భాజపా 8 గెలిచింది. సున్నా సీట్లకు 4 శాతం ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి భాజపా ఓటమిని విజయంగా భావించడం విచిత్రం. భాజపా8 సీట్లు 38.51 శాతం ఓట్లను సాధించడం గొప్ప విషయమే. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతికి పాల్పడకపోవడం, ఉచిత పథకాలు, ఆఖరుకు ‘మోదీనే మా ప్రధాని’ అంటూ పాక్‌ను హెచ్చరించడం, షాహీన్‌ఖాన్‌కు పరోక్షంగా మద్దతు ఇవ్వడం వంటివి కలిసొచ్చాయి. 

అలాగే భాజపాకు మదన్‌లాల్ ఖురానా, సుష్మా స్వరాజ్, సాహెబ్‌సింగ్ వర్మ, అరుణ్‌జైట్లీ వంటి ఢిల్లీ బేస్డ్ నాయకులు గతించడం, మనోజ్ తివారీ వంటి సున్నిత మనస్కుడు వాళ్ల స్థానాన్ని భర్తీ చేయలేక పోయాడు. కేజ్రీవాల్ ‘హనుమాన్ చాలీసా’ పఠించడం వల్ల హిందువుల ఓట్లలో కొంత చీలిక రావడం, భాజపా మీద విద్వేషంతో ముస్లింలు ఏకపక్షంగా ఓట్లు ఆప్‌కు వేయడం భాజపా ఓటమికి కారణం. ‘ముస్లింలు ఇలా ఓట్లేయడం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని మేధావీ చెప్పడు!? ఎందుకంటే అది ప్రజాస్వామ్య పరిరక్షణ అంటుంటారు.

అయితే భాజపా ఓటమికి స్థానిక నాయకత్వాలు కూడా ఒక కారణం. మోదీ, అమిత్ షాలే వచ్చి వ్యూహ రచన చేయాలని స్థానిక నాయకత్వాలు నోరు తెరచి చూస్తుండడం దిక్కుమాలిన చర్య. వాళ్ల స్థాయిలో గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాల్లో, కేంద్రంలో మంచి విజయం అందించారు. అంతేగాకుండా ఇటీవల భాజపాలోని కొందరు సంతుష్టీకరణ, లాబీయింగ్ ఉచ్చులో పడుతున్నారు. మీడియాలోని సింహ భాగం కమ్యూనిస్టు ప్రభావంతో, కుల ప్రాంతీయ పక్షపాతంతో నడుస్తున్నది. ఇదంతా భాజపా వ్యతిరేకం అని చెప్పేందుకు మొన్నటి ఢిల్లీ ఫలితాల విశే్లషణలే గొప్ప ఉదాహరణ.

భాజపాకు గుండెకాయ లాంటి జాతీయవాదం వదలిపెట్టిన ప్రతిసారీ ఇలాంటి పరాజయాలే. బట్టగాల్చి మీద వేసే ఎర్ర మీడియా సంస్కృతిపై కేసీఆర్‌లా ఓ దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలా కొన్ని వర్గాలను అతిగా సంతృప్తి పరచాలి అనే లక్షణం భాజపా వదిలిపెట్టాలి. సిద్ధాంతాలు లేని వ్యక్తులు రాజకీయాలు త్రిప్పే స్థితికి రానివ్వకూడదు. ఇతర పార్టీలతో లాబీయింగ్ చేసే వాళ్లను క్రింది స్థాయి నుండి వేళ్లతో సహా పీకెయ్యాలి. ఇతర పార్టీలపై ఓ వైపు యుద్ధం అంటూనే వాళ్లతో అవసరాలకు లాలూచీ పడడం ఓ కంట కనిపెట్టాలి. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భావ దారిర్య్రం ఉంది. అలాగే విశ్వవిద్యాలయాల్లో పత్రికా రంగంలో, మేధోరంగంలో జాతీయవాదంపై రాజీ పడకూడదు. సోషలిస్టులు, పూర్వ కమ్యూనిస్టులు భాజపాలోని కొందరు అగ్ర నాయకులతో సంబంధాలు నెరపుతూ ప్రాంతీయ పార్టీలకు లాభం చేస్తున్నారు. రోజువారీగా జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకోని సంఘ్ కూడా కొన్ని విషయాలలో నిర్లిప్తంగా ఉంటున్నది. తొంబయ్యవ దశకంలో ఉండే పోరాట పటిమ జాతీయవాదులు కోల్పోతున్నారు. స్థానిక నాయకత్వంలో మోదీ, షాల్లో ఉండే డైనమిజం ఒక వంతైనా లేదు. నిజానికి ఇపుడు వాళ్లిద్దరు గట్టి మనుషులు ఉండబట్టి సరిపోయింది గానీ వాజ్‌పాయ్ లాంటి వాళ్లున్నా చంద్రబాబు లాంటి వాళ్లు చక్రం తిప్పేవాళ్లు.

ఉత్తరాది రాష్ట్రాల్లో, కర్ణాటక మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో ఈ అవలక్షణాలన్నీ భాజపా నాయకుల్లో ఉన్నాయి. అమిత్ షా ఢిల్లీ నుండి వచ్చి రాష్ట్ర అధ్యక్షునితో అన్నీ చెప్పి వెళ్లాడు. కానీ రాష్ట్ర నాయకులు రాజధాని విడిచి కదలరు. జిల్లా అధ్యక్షులను తమ దగ్గరకే పిలుచుకుంటారు. ఈ జిల్లా నాయకుల మండల నాయకులను జిల్లా కేంద్రానికి పిలుచుకుంటారు. 

ఇదీ దుస్థితి. కాబట్టి క్రింది స్థాయిలో చాలా చోట్ల ఏజెంట్లు కూడా ఉండరు. దేశం విషయానికి వస్తే ప్రజలు భాజపా కావాలని కోరుకొన్నా, ప్రాంతీయ పార్టీ ఉచిత పథకాలు, ధన ప్రవాహం, పార్టీ నిర్మాణం - వ్యూహాల ముందు స్థానిక భాజపా నాయకుల చేష్టలు దిగదుడుపే. 2018 ఫిబ్రవరి తర్వాత గోరఖ్‌పూర్, పూల్పూర్ భాజపా ఓడగానే చంకలు గ్రుద్దుకున్నట్లే ఢిల్లీ ఓడగానే 2024 జాతకాల ఫలితాలను వారికి సమాధానం చెప్పాలంటే రాష్ట్రాల నాయకులు సంతుష్టీకరణ, లాబీయింగ్ వదిలిపెట్టాలి.



****************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*14-02-2020 : శుక్రవారం*


మానవులు దేహమే గొప్పదనే భ్రాంతిలో ఉంటారు. ఈ భ్రాంతితోనే జీవితాంతం అశాశ్వత వస్తువులు, ఆనందాల చుట్టూ తిరుగుతుంటారు. తమను ఉద్ధరించే శాశ్వత బ్రహ్మ పదార్థం ఒకటి ఉందన్న విషయం మరచిపోతారు. మనను నడిపించే ఆ శక్తి గురించి జ్ఞానం పొందడాన్నే ‘ఆత్మసాక్షాత్కారం’ అంటారు.

ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢా నిమాయయా

‘ఓ అర్జునా! యంత్రాన్ని ఎక్కిన వారిలాగా ఉన్న సమస్త ప్రాణులను తనశక్తితో కర్మల్లో ప్రవర్తింపజేస్తూ, ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నాడు’ అన్నాడు శ్రీకృష్ణుడు. రంగులరాట్నం ఎక్కిన పిల్లలు కొంతసేపటి తర్వాత భయంతో అక్కడ చూస్తు ఉన్నవారికి సైగ చేస్తే లాభం లేదు. రంగులరాట్నాన్ని తిప్పుతున్న వ్యక్తివైపు చూసి అరిస్తేనే ఉపయోగం. ఆ వ్యక్తి వల్లే అది ఆగుతుంది. సకల సృష్టికీ ఆధారభూతమైన పరమాత్మ తత్వమూ అంతే. 

సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు
సృష్టియున్నప్పుడు సృజన లేక
సకల దేశములందు సకల కాలములందు
సర్వ వస్తువులందు చంచలములేక
ప్రాగ్దక్షిణములందు పశ్చిమోత్తరమందు
నాల్గు మూలల మీద నడుమ క్రింద
అచలమై సత్యమై ఆద్యంతరహితమై
పరిపూర్ణమై బట్టబయలుగాను
ఏకమైయుండు ఏ బాధలేకయుండు
అట్టి వస్తువు కేవలాత్మయగును

.. అంటూ పరశురామ నరసింహ దాసు ఆత్మకు గొప్ప నిర్వచనం ఇచ్చాడు. ఉపనిషత్తులన్నీ ఆత్మ పదార్థాన్ని ఇలాగే వర్ణించాయి. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకొనేందుకు కఠోర సాధనలు అవసరం లేదు. మనలోని ‘నేను - మేను’ల భ్రమలను తొలగించుకొని స్వస్వరూపాన్ని పొందడమే ఆత్మజ్ఞానం. సాధకుడు రాగద్వేషాలను వదలిపెట్టి, అరిషడ్వర్గాల మాయలో పడకుండా ఉండడమే ఈ సాధనకు మొదటి మెట్టు. అందుకు మనస్సులోని మాలిన్యాలను ఒక్కొక్కటిగా తొలగించే పనికి పూనుకోవాలి. ఈ పొలుసులన్నీ తొలగిస్తూ పోతే అప్పుడూ ‘నేను’ అనేది కూడా లేకుండా పోతుంది. అలాంటి అత్యున్నత స్థితిలోకి వెళ్లడమే ఆత్మజ్ఞానం. మనమూ అలాంటి మహోన్నత స్థితిలోకి వెళ్లేందుకు గురుబోధ, గ్రంథాలు, సత్సంగం ఉపకరిస్తాయి.


*************************************
డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*


ఢిల్లీ-నోయిడా మధ్య రాకపోకలకు అడ్డుగోడ పెట్టిన షాహీన్ బాగ్ ధర్నాలోకి చిన్నపిల్లలను రాకుండా ఆపేయాలని సాహస బాలల అవార్డు గ్రహీత అయిన జెన్ గుణరతన్ సదావరై సుప్రీంకోర్టు సీజేను కోరింది. ఈ పనె్నండు ఏళ్ల బాలిక విజ్ఞప్తి అక్కడి రాజ్యాంగ పరిరక్షకులు వింటారో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవల ఆ నిరసన ప్రదర్శనలో నాలుగు నెలల శిశువు మరణించడం జరిగింది. ఈ దేశంలో కృత్రిమ రాజ్యాంగ పరిరక్షకులంతా రోజూ రకరకాల హక్కులకోసం పాటుపడేవారే. ఆఖరుకు దేశద్రోహులకు, రేపిస్టులకు కూడా వీళ్లు రక్షణ కవచంగా ఏర్పడుతుంటారు. వీళ్లదృష్టిలో రాజ్యాంగ పరిరక్షణ అంటే తైమూర్, గజనీ, ఘోరీ, నాదిర్షా, ఔరంగజేబులను గొప్పవాళ్లుగా పూజించడం. వాళ్ల తప్పులను ఎత్తిచూపినవాళ్లంతా మతతత్వవాదులుగా ముద్రవేస్తారు.

పోలీసులు రాష్టమ్రంతా కార్డన్ సెర్చ్ పేరుతో ప్రజలను చైతన్యవంతం చేస్తారు. కానీ హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం కార్డన్ సెర్చ్ చేయడం తప్పని ఓ ఎమ్మెల్యే పోలీసులను తిట్టి వెనక్కి పంపిస్తాడు? వాళ్లంతా రాజ్యాంగ పరిరక్షకులు!? బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల్లోని సురక్షిత ముస్లిములంతా ఈ దేశంలోకి స్వేచ్ఛగా రావాలని, లేదంటే సెక్యులరిజం ప్రమాదంలో పడిందని చెబుతారు. 


అదే బంగ్లాదేశ్ నుండి వచ్చిన తస్లీమా నస్రీన్‌పై ప్రెస్‌క్లబ్‌లో ప్రజాపతినిధులు దాడి చేస్తారు! ఇదంతా సెక్యులరిజం పరిరక్షణే! అలాగే గొప్ప ఇస్లామిక్ పండితుడు, మేధావి తారేఖ్ ఫత్తేను ‘నీకు ఈ దేశంతో సంబంధం లేదని నిందిస్తారు. పాకిస్తాన్ నుండి వెళ్లి కెనడా పౌరసత్వం తీసుకొని భారత్‌లో సింధు నాగరికత గొప్పతనాన్ని చెప్పే ఈ కమ్యూనిష్టు ఈ దేశంలోని అర్బన్ నక్సల్స్‌కు ససేమిరా నచ్చడు. బుర్హాన్ వనీని ఆరాధించే తుక్డే తుక్డే గ్యాంగుకు అద్నాన్ సమీ అస్సలు నచ్చడు. ఇదంతా రాజ్యాంగ పరిరక్షణే సుమా!
‘‘జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఆరునెలలుగా నిర్బంధంలో ఉన్నారు.


 ఎలాంటి అభియోగాలు లేకున్నా, ఇప్పటికీ వారు నిర్బంధంలోనే ఉండడం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? లేదా’’ అంటూ భావి భారత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెగ బాధపడిపోతుంది. ఏనాడైనా ‘కాశ్మీర్ పండిట్లు’ ఇన్ని అత్యాచారాలకు గురయ్యారు కదా! చిన్న కన్నీటిబొట్టు విడిచిందా? వాళ్ల దృష్టిలో కాశ్మీర్ అంటే ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలే. వాళ్లను కాపాడేందుకే మన దేశం ఉంది. ఈ రాజ్యాంగ పరిరక్షణలన్నీ వారి కోసమే. 

కాశ్మీర్ రాష్ట్రం తీవ్రవాదుల చేతిలో బందీ అయినపుడు ఏ ప్రజాస్వామ్యవాదీ ఈ దేశంలో నోరు విప్పలేదు. కానీ ఒమర్ అబ్దుల్లాకు గడ్డం పెరిగిందని చాలామంది కృతక ప్రజాస్వామ్యవాదులు బాధ పడిపోతున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యమే! ఎందుకంటే, సూడో సెక్యులర్ మేధావులంతా ‘రాజ్యాంగం’ అంటూ గొప్ప ప్రవచనాలు చెబుతున్నారు కాబట్టి మనం నమ్మి తీరాల్సిందే. కానీ పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో 311 ఓట్లు పొందినా, రాజ్యసభలో 125 ఓట్లు పొంది గెలుపొంది, డిసెంబర్ 12నాడు భారత రాష్టప్రతి చేత పౌరసత్వ సవరణ చట్టంగా ఆమోదం పొందినా అది ప్రజాస్వామ్యం కానేకాదు. 

ఎందుకంటే ఈ అద్భుత ప్రజాస్వామ్య పరిరక్షణవాదులు ఇలాంటి విషయాలను ప్రజాస్వామ్యంగా స్వీకరించరు. ఎందుకంటే వాళ్లది ‘షరియా బోల్ష్‌విక్ ప్రజాస్వామ్యం!?’ అందునా ఈ దేశ మెజారిటీ ప్రజల ప్రతినిధిగా ముద్రవేయబడ్డ నరేంద్ర మోదీ, అమిత్‌షాలు చెప్తే వీళ్లు వింటారా? ఎందుకంటే ఈ దేశ మెజారిటీ ప్రజల గొంతును అణచడమే నిజమైన ప్రజాస్వామ్యం? ఇక కమ్యూనిస్టు బాకాలు చెప్పే కులజాఢ్యం వంటి అవలక్షణాలన్నీ ఈ దేశ మెజారిటీ ప్రజల్లో ఉన్నాయి. మరి 800 ఏళ్లు ఈ దేశాన్ని గొప్పగా పాలించిన బాబర్ సంతతి ఎందుకు కులతత్వం పోగొట్టలేదని ఒక్కరూ ప్రశ్నించరు? అలా ప్రశ్నిస్తే సెక్యులర్ పాతివ్రత్యం భంగం అయిపోయి మనం కొట్టుకపోమూ!

అంతెందుకు! వ్యతిరేకంగా ధర్నాలు చేసేవారు గతంలో ఒక్కసారైనా మనఃపూర్వకంగా జాతీయగీతం ఆలపించారా? మువ్వనె్నల జెండాలు ఒక్కసారైనా వీరు చేత ధరించారా? అని ఈ రోజు భారత ప్రజలు విస్తుపోతున్నారు. మత్సే భగవాన్, జోగేంద్రనాథ్ మండల్ వంటి దళిత నాయకులకు పాకిస్తాన్‌లో ఎంత ఘర పరాభవం ఎదురయ్యిందో తెలియకుండానే చంద్రశేఖర్ ఆజాద్, రావణ్ వంటివాళ్లు జామియా మసీదు మెట్లపైన గెంతులేస్తున్నారా? జోగేంద్ర నాథ్ మండల్‌ను మూడేళ్లకే రాజీనామా చేసి వెనక్కి వెళ్లిపోయేలా చేసిన వారి గురించే ఈ ఆందోళన అని అర్థం చేసుకోవాలా?


 బమియాన్ బుద్ధ విగ్రహాలను ఫిరంగులతో పేల్చేసినవారిని పిలిచి అక్కున చేర్చుకొనే ప్రజాస్వామ్య పరిరక్షణ చూస్తే నవ్వాలా! ఏడ్వాలా? లక్షలాదిమందిని హత్యచేసిన బంగ్లాదేశ్‌లోని గొప్ప ప్రజాస్వామ్యవాదులను ఈ దేశంలోకి తేవాలని ఇక్కడి ప్రజాస్వామ్య పరిరక్షణవాదులు ఆందోళన చేస్తున్నారా?

 డా॥ బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచి, కనీసం ఈ దేశం ట్రాఫిక్ రూల్స్‌ను కూడా లెక్కలేనివాళ్లు రాజ్యాంగ పరిరక్షక అవతారం ఎత్తితే మన ఏ బావిలో దూకి చావాలి? ప్రగతిశీలత పేరుతో దేశ మూలభావన చంపడం ‘భ్రూణహత్య’ కాదా? అనేకానేక రాజ్యాంగ సూత్రాలను డా అంబేద్కర్ వడబోసి కదా మన రాజ్యాంగం సిద్ధం చేసింది. అలాంటి మార్గదర్శి రాజ్యాంగ రచన సందర్భంలో ‘లౌకికవాద’ శబ్దం ఎందుకు చేర్చలేదో ఈ పరిరక్షకులు చెప్పగలరా? కామాలు, ఫుల్‌స్ట్ఫాలు కూడా మార్చేందుకు వీలులేని రాజ్యాంగ ప్రవేశికలోకి సెక్యులర్ శబ్దం ఎలా చేరింది? ఎవరో అన్నట్లు ‘రాజ్యాంగంలోని ఒక్క వంతు విషయాలను ఆచరించినా ఈ దేశం ఎప్పుడో మారిపోయేది’’ అన్నది నిజం
.
కృత్రిమంగా సృష్టిస్తున్న రాజ్యాంగ పరిరక్షకులు కేవలం ఒక వర్గంవారి హక్కులకే రాజ్యాంగం ఉందని భ్రమపెట్టడంకన్నా వాచాలత్వం ఇంకొకటి లేదు. మెమొంటోలుగా, బహుమతులుగా ఇచ్చిన రాజ్యాంగాన్ని పుస్తకాల అల్మారాల్లో అలంకారం కోసం కాకుండా కాస్త చదివితే తెలుస్తుంది. ‘ఇది అందరి కోసమా? కొందరి కోసమా!’ అని.


*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*07-02-2020 : శుక్రవారం*


తీరంలో నడుస్తున్న ఓ వ్యక్తికి.. ఒడ్డునపడి గిలగిలా కొట్టుకుంటున్న ఓ చేప
కన్పించింది. ‘‘అయ్యో!’’ అని దానిపై జాలి చూపుతూ.. ఇంటికి తీసుకొచ్చి,
ఖరీదైన పరుపుపై పడుకోబెట్టి, విసరడం మొదలుపెట్టాడు. భార్యను పిలిచి,
దాని నోట్లో కాస్త కాఫీ పోద్దామన్నాడు. ఆమె చేపను చూసి ‘‘ఏమండీ!
దాని నోట్లో కాఫీ పోస్తే.. అది చచ్చిపోతుంది వెంటనే నదిలో వదిలిపెట్టండి’’
అన్నది. ‘‘దాని స్థానం అదే..! అది అక్కడైతేనే ఆనందంగా జీవిస్తుంద’’ని హితవుచెప్పింది.
అలాగే దుఃఖం అనే ఒడ్డుపై పడి బాధపడుతున్న మానవులను ఆనందమనే
సాగరంలోకి పంపించేదే ఆధ్యాత్మికత. మనకున్న ఆనందాన్ని కోల్పోయి, ప్రస్తుతం
కళ్లముందు కన్పించేదే శాశ్వతం అనుకుంటున్నాం. కానీ, అందులో
శాశ్వతానందం లేదని గ్రహించే సరికి మన జీవితం మిగలడంలేదు.

ఒక వ్యక్తికి వంద ఎకరాల మామిడి తోటతో పాటు.. చక్కెర వ్యాధి కూడా
అమితంగా ఉంది. ఇంకొకరికి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి.
కానీ, రాత్రికి ఒక్క జొన్నరొట్టె కన్నా ఎక్కువ తినడం సాధ్యం కాదు. 

ఇంకొకరికి ముగ్గురు సంతానం. వారంతా విదేశాల్లో ఉంటున్నారు. చస్తే
చివరి చూపునకు కూడా వారు అందకపోవచ్చు. మరో వ్యక్తికి గొప్ప పదవి ఉంది.
కానీ, దాన్ని నిలబెట్టుకొనేందుకు రాత్రింబవళ్లు నిద్రలేదు.
‘‘రాళ్లను అరిగించుకునే వయస్సులో తినేందుకు తిండిలేదు;
కోట్లు సంపాదించాక మరమరాలు కూడా అరిగించుకోలేకపోతున్నాడు’’
అన్న సామెత ఊరికే రాలేదు.
ధనం, పదవి, స్వార్థం, ఆశ్రిత పక్షపాతం, వ్యాధులు, బాధలు, మరణం,
వృద్ధాప్యం, అనవసర చింత, అశాంతిగా జీవించడం, అసంతృప్తి,
హద్దులు మీరిన కోరికలు.. ఇవన్నీ దుఃఖానికి వివిధ రూపాలు.
మానవుడిని వెంటాడే ఈ దుఃఖాలకు ఆధ్యాత్మిక ఆనందమే పరిష్కారం.
జీవితానికి సరిపడా డబ్బు చాలు అనుకుంటే అదే ఆనందం.

పదవి వెంట మనం పడకుండా, అది వస్తే స్వీకరించడమే ఆనందం.
నేను-నాది అన్న రెండు అవలక్షణాలను వదిలిపెడితే.. నీవు ఆనందమూర్తివే.
శరీరాన్ని నియంత్రణతో ఉంచుకుంటే వ్యాధులు, బాధలు నీ దరిచేరవు.
సహజంగా వచ్చే వృద్ధాప్యం, మరణాన్ని సంతోషంగా స్వీకరించగలిగితే
అది ఆత్మానందమే. మానవునిలో నిద్రాణంగా ఉన్న దివ్యత్వాన్ని
తెలుసుకోవాలి. పశుపక్ష్యాదులకు లేని వివేచన మనిషికి మాత్రమే ఉంది.
ఆలోచనాశక్తి, అనుభవం, విశ్లేషణ.. ఈ మూడు మానవుడిని ఇతర
జంతువుల నుంచి వేరు చేస్తున్నాయి. వీటి ఆధారంగా మనం
మన జీవితాన్ని మలుచుకోవాలి.
‘‘అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మృత్యురాపద్యతే మోహాత్‌ సత్యేనాపద్యతే అమృతం’’
అమృతత్వం, మృత్యువూ రెండూ దేహంలోనే ఉన్నాయి. మోహాన్ని
అంటిపెట్టుకొన్నప్పుడు మృత్యువును పొందుతారు. సత్యం
అవలంబిస్తే అమృతత్వాన్ని పొందుతారు.. అని మహాభారతం చెప్పింది.
ఆ అమృతత్వమే ఆనందం. అది శాశ్వతంగా ఉంటే ఆయనే భగవంతుడు.
ఆనందాన్ని అంటిపెట్టుకొని ఉండడమే బ్రహ్మభావన.


******
*
************************


 డాక్టర్. పి. భాస్కర యోగి*

*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*